Chandrababu: ముఖ్యమంత్రిగా అడుగుతున్నా.. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
- రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అయింది
- ఇప్పటికీ లోటు బడ్జెట్ ఇవ్వలేదు
- రాజధాని కోసం ఇచ్చిన రూ.1500 కోట్లకు యూసీలు ఇచ్చాం
- అవి తప్పు అని ప్రచారం చేస్తున్నారు
తాము పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తుంటే మరోవైపు ఉభయ సభలను పదే పదే వాయిదాలు వేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ... రాజీలేని పోరాటం చేసి హక్కులను కాపాడుకుందామని అన్నారు. ప్రజలను సంఘటిత పరచాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ నల్లబ్యాడ్జీలు ధరించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. నిన్నటి అఖిలపక్ష సంఘాల సమావేశానికి రాని వారిని వచ్చే సమావేశానికి ఆహ్వానిస్తామని అన్నారు.
రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అయిందని ఇప్పటికీ బడ్జెట్ లోటును పూడ్చడం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరానికి సంబంధించి ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పామని, రాజధాని కోసం ఇచ్చిన రూ.1500 కోట్లకు యూసీలు ఇచ్చామని తెలిపారు. యూసీలు ఇస్తే అవి తప్పు అని ప్రచారం చేస్తున్నారని, మరి కొందరు బీజేపీ నేతలు అసలు యూసీలే పంపలేదని ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. తాను ఈ రోజు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా అడుగుతున్నానని, దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని నిలదీశారు.