vishnu kumar raju: అచ్చెన్నాయుడిని చూస్తేనే భయం వేస్తోంది అధ్యక్షా!: విష్ణుకుమార్ రాజు
- ఆయన వస్తేనే నాకు దడ పుడుతోంది
- అన్నిటికీ నాపై వేలెత్తి చూపుతూ మాట్లాడుతున్నారు
- అఖిలపక్షానికి రాకపోవడానికి రాజకీయ కారణాలుంటాయి
బీజేపీ, జగన్, పవన్ కల్యాణ్ లు కలసిపోయారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను శాసనసభలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఖండించారు. బీజేపీలో బీ అంటే భారతీయ జనతా పార్టీ అని, జే అంటే జగన్ అని, పీ అంటే పవన్ అని అచ్చెన్నాయుడు కామెంట్ చేస్తున్నారని... వాళ్లతో తాము ఎక్కడ కలిశామని ఆయన ప్రశ్నించారు. తాము కలిసినట్టు మీరెక్కడైనా చూశారా? కెమెరాలతో ఏమైనా షూట్ చేశారా? అని అడిగారు.
అసెంబ్లీకి వచ్చినప్పుడు మాత్రమే తాను జగన్ ను కలిశానని... చాలా కాలంగా ఆయన సభకు కూడా రావడం లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ను ఒక్కసారి చూశామని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ విష్ణు ఈ విధంగా స్పందించారు. ఇదే సమయంలో కలగజేసుకున్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నిన్న నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు, సంఘాలు, అధికారులు హాజరయ్యారని... బీజేపీ, వైసీపీ, జనసేన మాత్రమే రాలేదని చెప్పారు. వీరు ముగ్గురూ కలసి పోయారని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుందని అన్నారు.
అనంతరం విష్ణు మాట్లాడుతూ, అధ్యక్షా... అచ్చెన్నాయుడు గారు చాలా గొప్పగా చెబుతారు అన్నారు. 'లేనిది ఉన్నట్టు, ప్రజలు నమ్మేటట్టు... అబ్బ... ఏమి చెబుతారు అధ్యక్షా' అంటూ ఎద్దేవా చేశారు. ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదని... తాము చెబితే పవన్, జగన్ లు వింటారా? అని ప్రశ్నించారు. అంతెందుకు... తాను చెప్పింది అచ్చెన్నాయుడు కూడా వినరని అన్నారు. ఎవరి పార్టీ స్టాండ్ వారికుంటుందని చెప్పారు. అఖిలపక్షానికి రాకపోవడానికి రకరకాల రాజకీయ కారణాలు ఉంటాయని తెలిపారు.
పదేళ్ల క్రితం ఆ ప్రభుత్వం అలా చేసింది, ఇలా చేసిందని అందరూ తనను చూపిస్తున్నారని విష్ణు అసహనం వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వంలో తాను లేనని, అప్పుడు తాను ఎమ్మెల్యేను కూడా కాదని చెప్పారు. అచ్చెన్నాయుడు గారైతే ఊగిపోతూ, తనపై వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతున్నారని చెప్పారు.
అధ్యక్షా, అచ్చెన్నాయుడిని చూస్తేనే నాకు భయం వేస్తోందని అన్నారు. ఆయన వస్తేనే తనకు దడ పుడుతోందని చెప్పారు. తనను వేలెత్తి చూపిస్తూ, లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. 'అధ్యక్షా... అచ్చెన్నాయుడు ఆయన ఉగ్రరూపాన్ని నాపై చూపించకూడదని మీ ద్వారా కోరుతున్నా' అని చెప్పారు.