Telugudesam: మేం చెబితే అచ్చెన్నాయుడే వినడు... జగన్, పవన్ వింటారా?: విష్ణుకుమార్ రాజు
- చంద్రబాబుతో సమావేశానికి బీజేపీ గైర్హాజరు
- స్వార్థ ప్రయోజనాల కోసమే అఖిలపక్షం
- చంద్రబాబు కుట్రలో భాగం కాదలచుకోలేదు
- బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న నిర్వహించిన అఖిలపక్ష, అఖిల సంఘాల సమావేశానికి పిలిచినా రాలేదని వచ్చిన వార్తలపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకే తాము గైర్హాజరు అయ్యామని, చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం సమావేశం పెడితే తామెందుకు హాజరు కావాలని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్, జగన్ లను అడ్డు పెట్టుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందని తెలుగుదేశం నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన, "వైఎస్ జగన్ మేం చేబితే ఎందుకు వింటారు? మేం చెప్పిన మాట పవన్ వింటాడా? మేం చెబితే అచ్చెన్నాయుడే వినడు... వారెందుకు వింటారు?" అన్నారు. బీజేపీతో పొత్తు విషయంలో తన స్వార్థం కోసం టీడీపీ యూ-టర్న్ తీసుకుందని, టీడీపీ కుట్రలో తాము భాగం కాబోమని అన్నారు.
ఇదిలావుండగా, అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో మద్యం అంశంపై చర్చ సాగగా, ప్రభుత్వ తీరును విష్ణుకుమార్ రాజు విమర్శించారు. రాష్ట్రంలోని మద్యం పాలసీలో ఎన్నో లోపాలు ఉన్నాయని, దేవాలయాలు, పాఠశాలలకు దగ్గరగా మద్యం షాపులు ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన ఎక్సైజ్ మంత్రి జవహర్, అటువంటిదేమీ జరగడం లేదని, అసలు తమ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణించడం లేదని స్పష్టం చేశారు.