Chandrababu: మా అమ్మానాన్నలనే కించపరుస్తూ మాట్లాడతారా? ఇది దుర్మార్గానికి పరాకాష్ట: మండిపడ్డ చంద్రబాబు

  • తల్లిదండ్రులను నిందించడం భారతీయ సంప్రదాయమా?
  • ప్రధాని కాళ్లకు మొక్కడం భారతీయ సంప్రదాయమా?
  • విజయసాయిరెడ్డిపై మండిపడ్డ చంద్రబాబు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎవరికైనా తల్లిదండ్రులు దైవంతో సమానమని... చనిపోయిన తన తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడతారా? అంటూ మండిపడ్డారు. ఎవరి తల్లిదండ్రులనైనా నిందించడం భారతీయ సంప్రదాయమా? అని ప్రశ్నించారు. ప్రధాని కాళ్లకు మొక్కడం భారతీయ సంప్రదాయమా? అని నిలదీశారు.

 విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రధాని కార్యాలయం చేరదీస్తోందని విమర్శించారు. ఒక తల్లికి, ఒక తండ్రికి పుట్టినవారు చంద్రబాబులా మాట్లాడరంటూ విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో ఈ ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రానికి న్యాయం జరగాలని పోరాడుతున్న తనపైనే బురదజల్లే కార్యక్రమాన్ని వైసీపీ నేతలు చేపట్టారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఏపీ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటం కన్నా తనకు మరేదీ ముఖ్యం కాదని అన్నారు.

ఎంపీలను సులభంగా లెక్కించేందుకు వీలుగా నీలి రంగు కాగితాలు పట్టుకుని ఎంపీలంతా లేచి నిలబడ్డారని... అయినా, స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేయడం దారుణమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన అంశంలోని 19 అంశాలపై లోక్ సభలో డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంటుకు నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయని... ఈ నేపథ్యంలో, ప్రతి రోజు కూడా అత్యంత కీలకమేనని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News