deepak mishra: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై అభిశంసన తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు!
- పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు
- సంతకాల సేకరణను ప్రారంభించిన కాంగ్రెస్
- విపక్ష పార్టీల నేతలో చర్చలు జరుపుతున్న అజాద్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహార శైలిపై సహచర న్యాయమూర్తులు ఆమధ్య ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఆయనపై పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ఎంపీల నుంచి సంతకాలను కాంగ్రెస్ సేకరిస్తోందని ఎన్సీపీ నేతలు వెల్లడించారు. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.
ఎన్సీపీ ఎంపీ మెమన్ మాట్లాడుతూ, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అభిశంసన కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలిపారు. తాను కూడా ఇప్పటికే సంతకం చేశానని... ఇంకా ఎంత మంది సంతకాలు చేశారో కాంగ్రెస్ నే అడగాలని సూచించారు. సంతకాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు సంతకాలు చేసిన వారిలో కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐలతో పాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు.
మరోవైపు, సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టాలంటే... లోక్ సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీల సంతకాలు అవసరమవుతాయి. కాంగ్రెస్ అగ్రనేత గులాం నబీ అజాద్ ఈ విషయమై ఇతర పార్టీల నేతలతో సమావేశమై, చర్చలు జరుపుతున్నారు. పార్లమెంటులో అభిశంసన తీర్మానం నెగ్గితే, దీపక్ మిశ్రా చీఫ్ జస్టిస్ పదవిని కోల్పోతారు.