Chandrababu: టీడీపీ ఎంపీలపై చంద్రబాబు ఆగ్రహం!
- ఢిల్లీకి వెళితే ఎంపీలు సహకరించడం లేదు
- చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన అఖిల సంఘాల నేతలు
- పరువు తీసే పనులు చేయవద్దన్న చంద్రబాబు
- ఎవరితోనూ రహస్య సమావేశాలు వద్దని ఆదేశం
ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు వెళ్లినప్పుడు అక్కడున్న ఎంపీలు సహకరించడం లేదని నిన్న అఖిల సంఘాల సమావేశంలో కొందరు ప్రస్తావించిన విషయాన్ని, ఈ ఉదయం ఎంపీలతో జరిపిన టెలీ కాన్ఫరెన్స్ లో గుర్తు చేసిన చంద్రబాబు ఎంపీలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఇమేజ్ ను, పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసేలా కొందరు ఎంపీలు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన, ఇటువంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.
ఢిల్లీకి వచ్చిన తెలుగువారికి సహకరించడం ఎంపీల బాధ్యతని గుర్తు చేశారు. ఏపీ భవన్ ను సమన్వయ వేదికగా వినియోగించుకోవాలని సూచించిన ఆయన, ఏ ఎంపీ కూడా కేంద్రమంత్రులను రహస్యంగా కలుసుకోవద్దని ఆదేశించారు. ఈ విషయంలో ఎంపీలంతా జాగ్రత్తగా ఉండాలని, వారి చర్యలను అందరూ గమనిస్తున్నారని, మీడియా ముందు, విపక్షాల ముందు పరువు తీసేలా ప్రవర్తించ వద్దని హితవు పలికారు.