Muslim: ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా రాజస్థాన్ లో ముస్లిం మహిళల ర్యాలీ!
- మా చట్టాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు
- రాజ్యంగం ఇచ్చిన హక్కులను కాలరాయొద్దు
- బిల్లును వెంటనే ఉపసంహరించుకోండి
- ప్రధాని, రాష్ట్రపతికి ముస్లిం మహిళల అభ్యర్థన
నరేంద్రమోదీ ప్రభుత్వానికి ముస్లిం మహిళలు షాకిచ్చారు. ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు వ్యతిరేకంగా రాజస్థాన్‌లోని ఫతేపూర్‌లో వందలాదిమంది మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినదించారు. ముస్లిం చట్టాల్లో జోక్యం చేసుకోవడం మానాలని హితవు పలికారు.
ఏ మతం వారు ఆ మతాన్ని ఆచరించుకోవచ్చని రాజ్యాంగం పేర్కొందని, ఇప్పుడు దానిని ప్రభుత్వం ఉల్లంఘించాలనుకోవడం తగదని మహిళలు పేర్కొన్నారు. తాము కనుక పురోగతి సాధించాలని ప్రభుత్వం కోరుకుంటే వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినా బలవంతంగా బిల్లును తమపై రుద్దాలని చూస్తే తమకు మరణం తప్ప మరో దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ తక్షణం స్పందించి బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందిగా అభ్యర్థించారు.
దాదాపు రెండు కిలోమీటర్ల పాటు సాగిన ఈ ర్యాలీలో వందలాదిమంది మహిళలు ప్లకార్డులు పట్టుకుని పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళలకు, పిల్లలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.