Amit Malaveya: కర్ణాటక తేదీల లీక్ పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మెడకు ఉచ్చు!
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ముందే చెప్పిన అమిత్ మాలవీయ
- కఠిన చర్యలుంటాయని హెచ్చరించిన ఎన్నికల కమిషన్
- దర్యాఫ్తు చేసేందుకు కమిటీని నియమించిన ఈసీ
ఎలక్షన్ కమిషన్ చెప్పకముందే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు మే 12న జరుగుతాయని తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై చర్యలకు బీజేపీ సిద్ధమవుతుండగా, తేదీల లీక్ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తున్న ఎన్నికల సంఘం, మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు జరపాలని ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
సీబీఐతో పాటు ఐటీతోనూ దర్యాఫ్తు చేయించాలని భావిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈసీలోని సీనియర్లతో కూడిన కమిటీ వేశామని, వారం రోజుల్లో నివేదిక అందుతుందని, ఆపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కాగా, కన్నడనాట అసెంబ్లీ ఎన్నికల తేదీలను అమిత్ ముందే చెప్పడం, దాదాపు అవే తేదీలను ఈసీ పేర్కొనడంతో తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నిన్న ఈసీ మీడియా సమావేశంలో పాల్గొన్న పాత్రికేయులు గుర్తు చేయగా, ఇది తీవ్రమైన అంశమని, తేదీలు లీక్ చేసిన వారిపై చర్యలుంటాయని ఈసీ పేర్కొంది. కాగా, ఈ ట్వీట్ పై వివాదం పెరుగుతున్న వేళ, అమిత్ మాలవీయ దాన్ని తొలగించారు.