Shahid Khaqan Abbasi: పాక్ ప్రధాని అబ్బాసీని దారుణంగా అవమానించిన అమెరికా!
- అనారోగ్యంతో బాధపడుతున్న సోదరిని కలవడానికి అమెరికా వెళ్లిన పాక్ ప్రధాని
- ఎయిర్‌పోర్టులో తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది
- అమెరికాను దుమ్మెత్తి పోస్తున్న పాక్ మీడియా
పాకిస్థాన్ ప్రధాని షాహిద్ ఖాఖన్ అబ్బాసీకి అమెరికాలో ఘోర పరాభవం ఎదురైంది. ఇటీవల ఆయన అమెరికాలో పర్యటించినప్పుడు ఆ దేశ భద్రతా సిబ్బంది అందరితోపాటు ఆయనను కూడా తనిఖీ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. విషయం బయటకు రావడంతో పాకిస్థాన్ మీడియా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అణ్వాయుధ వాణిజ్యంతో లింకులు ఉన్నాయని అనుమానిస్తూ పాకిస్థాన్‌కు చెందిన ఏడు కంపెనీలపై సోమవారం అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తర్వాతి రోజే పాక్ ప్రధానికి జరిగిన అవమానం బయటకు రావడంపై పాక్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా విమానాశ్రయంలో దిగిన ప్రధాని అబ్బాసీ బ్యాగు, కోటు పట్టుకుని ఎయిర్ పోర్టు సెక్యూరిటీ చెక్ గుండా నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను పాకిస్థాన్ టీవీ చానళ్లు ప్రచారం చేస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరిని పరామర్శించేందుకు అబ్బాసీ గత వారం అమెరికా వెళ్లారు. అలాగే షెడ్యూల్‌లో లేకపోయినప్పటికీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కలిశారు.
ఓ దేశ ప్రధానిని భద్రత పేరుతో తనిఖీ చేయడంపై పాక్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, అతడో దేశానికి ప్రధాని అంటూ అమెరికా తీరుపై మండిపడుతున్నాయి. ఆయన పర్యటనను వ్యక్తిగత పర్యటనగానే చూడరాదని, 22 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని ఇలా అవమానించడం తగదని ఆక్రోశించాయి. అంతేకాదు, అబ్బాసీ తన దేశానికి తలవంపులు తెచ్చిపెట్టారని విమర్శించాయి.
పాక్ ప్రధానిని తనిఖీ చేయడంపై అమెరికా సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ, అమెరికా రక్షణే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.