Uttar Pradesh: ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్న మాయావతి!

  • ఇకపై సమాజ్ వాదీకి మద్దతిచ్చేది లేదు
  • ఒంటరిగానే ఎన్నికల బరిలోకి
  • అఖిలేష్ యాదవ్ రాజకీయ పరిపక్వతలేని వ్యక్తి
  • యూ-టర్న్ తీసుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి

యూపీలో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య హనీమూన్ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. సమాజ్ వాదీ పార్టీకి ఇకపై జరిగే ఎన్నికల్లో మద్దతిచ్చే ప్రసక్తే లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన గోరఖ్ పూర్, ఫుల్ పూర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీలు జతకట్టిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో ఘన విజయం తరువాత ఇరు పార్టీల పొత్తు కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, యూ-టర్న్ తీసుకున్న మాయావతి, త్వరలో జరిగే కైరానా పార్లమెంట్ పరిధిలోని నూర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి మద్దతివ్వబోనని ప్రకటించారు. 2019 ఎన్నికల్లోనూ తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తమ కార్యకర్తలకు వెల్లడించానని, గోరఖ్ పూర్, ఫుల్ పూర్ లో మాదిరిగా తన పార్టీ కార్యకర్తలు సమాజ్ వాదీ అభ్యర్థుల విజయానికి కృషి చేయబోరని వెల్లడించారు.

అఖిలేష్ యాదవ్ లో రాజకీయ పరిపక్వత లేదని ఆరోపించిన ఆమె, అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీతో తాము పొత్తును కొనసాగించే పరిస్థితి లేదని అన్నారు. కాగా, సోమవారం నాడు జిల్లా, జోనల్ సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న మాయావతి, ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా మనసు మార్చుకోవడం గమనార్హం.

Uttar Pradesh
Mayawati
Akhilesh Yadav
BJP
SP
BSP
  • Loading...

More Telugu News