Bihar: 'సునో బాబూ... బాత్ సమ్జో'... లాలూ కుమారుడు తేజస్వికి నితీశ్ కుమార్ విలువైన సలహా
- బీహార్ అసెంబ్లీలో ఆసక్తికర సంవాదం
- మంత్రి ప్రసంగానికి అడ్డుపడిన తేజస్వీ
- క్లాస్ పీకిన సీఎం నితీశ్ కుమార్
తాను బీహార్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న వేళ, విపక్షనేత, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ ను ఉద్దేశించి సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల ప్రసంగానికి పదేపదే అడ్డుపడుతున్న తేజస్విని "సునో బాబూ బాత్ సమ్జో" (విను నాయనా... చెప్పేది అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు) అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర బడ్జెట్ ఆమోదం కోసం జరుగుతున్న చర్చలో ఇంధన మంత్రి బ్రిజేంద్ర యాదవ్ మాట్లాడుతున్న వేళ, నితీశ్, తేజస్వీల మధ్య వాగ్వాదం జరిగింది. ఆయన మాట్లాడుతున్న సమయంలో తేజస్వీ కల్పించుకుని తానో ముఖ్యమైన సమాచారాన్ని సభ ముందుంచుతానని చెబుతూ మైకందుకున్నారు. ఆపై సభలో వివాదాస్పద అంశాలు ప్రస్తావిస్తూ, గత కొన్ని గంటలుగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
దీనిపై అధికార, విపక్ష సభ్యులు రభసకు దిగగా, సభ పక్కదారి పట్టింది, దీంతో సీఎం నితీశ్ కల్పించుకుని, స్థానిక అంశాలను చర్చించేందుకు ఇది సమయం కాదని, రూమర్లను సభలో ప్రస్తావించి ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టే పనులను దయచేసి చేయవద్దని హితవు పలికారు. మంత్రి పలికేది విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలంటే, ప్రస్తుతం యువకుడిగా ఉన్న తేజస్వీ ఎన్నో నేర్చుకోవాలని క్లాస్ పీకారు. కాగా, నితీశ్ ప్రభుత్వంలో తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఏడాదికిపైగా పని చేసిన సంగతి తెలిసిందే.