Pawan Kalyan: అమిత్ షా లేఖకు నేనెందుకు స్పందిస్తా!: పవన్ కల్యాణ్

  • ఏపీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వస్తే స్పందిస్తా
  • ప్రత్యేక హోదా లేకపోవడంతో  ప్రజలు చాలా నష్టపోతున్నారు
  • అన్ని విషయాల్లో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది
  • ఏపీకి ఇంతకాలం న్యాయం చేయని బీజేపీ-టీడీపీలు ఇకపై చేస్తాయని నమ్మకమేంటి? : పవన్ కల్యాణ్ 

ఏపీ వ్యవహారాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడితే నేనెందుకు స్పదించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో వామపక్ష నేతలతో పవన్ భేటీ ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు వారి సమావేశం జరిగింది.

అనంతరం, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, అమిత్ షా లేఖను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆయన ఆ లేఖ రాశారని అన్నారు. ఏపీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వస్తే పరిగణనలోకి తీసుకుంటామని, అప్పుడు స్పందిస్తానని స్పష్టం చేశారు.

 ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల  ప్రజలు చాలా నష్టపోతున్నారని, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. ప్రతిసారి రాజీపడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని, మౌలిక వసతులు కల్పించాల్సిన పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. ఉత్తరాంధ్రలో పసిబిడ్డలు చనిపోతుంటే ఎందుకు పట్టించుకోలేదు? నిధుల కొరత ఉన్నప్పుడు పుష్కరాలకు నిధులు ఎలా ఖర్చు చేస్తారు? అని ప్రశ్నించారు.

 అన్ని విషయాల్లో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని పవన్ విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణం టీడీపీ అనుబంధ వ్యక్తులదిగా తయారవుతోందని, బీజేపీ-టీడీపీల మీద తమకు ఎలాంటి నమ్మకం లేదని, ఏపీకి ఇంతకాలం న్యాయం చేయని బీజేపీ-టీడీపీలు ఇకపై చేస్తాయని నమ్మకమేంటి? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News