YSRCP: అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయి: ఎంపీ మేకపాటి

  • టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి
  • 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే మంచి సంకేతం వెళ్తుంది
  • టీడీపీకి మెజార్టీ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధనలో విఫలం
  • మీడియాతో వైసీపీ ఎంపీ మేకపాటి

అవిశ్వాసతీర్మానంపై చర్చ జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని, చర్చ జరగాలనే తాము కోరుకుంటున్నామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాశ్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం, రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ వాయిదా పడిన రోజే, స్పీకర్ ఫార్మాట్ లో తాము రాజీనామాలు చేస్తామని చెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని, 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే, దేశానికి మంచి సంకేతం వెళ్తుందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, వైఎస్ జగన్ మొదటి నుంచి ఒకే మాట చెబుతున్నారని, ప్రత్యేక హోదా కోసం తాము నిరంతరం పోరాడుతూనే ఉన్నామని అన్నారు.

నాడు కనిగిరి సభలో అవిశ్వాసం పెడతామని తాము ప్రకటించగానే, ‘అవిశ్వాసంతో ఏమవుతుంది?’ అని చంద్రబాబు ప్రశ్నించిన విషయాన్ని మేకపాటి ప్రస్తావించారు. మార్చి 15 అవిశ్వాసం నోటీస్ ఇచ్చింది తామేనని, తమ దారిలోనే చంద్రబాబు వస్తున్నారని అన్నారు. అవిశ్వాసం విషయంలో అన్ని పార్టీలను తాము కలిశామని, కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ తమకు మద్దతు తెలిపాయని చెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, టీడీపీకి మెజార్టీ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధనలో విఫలమైందని, తమకు 20 మంది ఎంపీలను ఇస్తే కచ్చితంగా హోదా సాధించి తీరుతామని, హోదా సాధన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఏ పార్టీ అయితే ఇస్తుందో, ఎన్నికల తర్వాత ఆ పార్టీకే మద్దతిస్తామని మేకపాటి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News