visa: వీసా, మాస్టర్ కార్డ్ కు గడ్డు రోజులు... భారత మార్కెట్లో బక్క చిక్కిపోతున్న కార్డు కంపెనీలు

  • దేశీయంగా పెరిగిపోతున్న డిజిటల్ చెల్లింపులు
  • యూపీఐ, రూపే కార్డులకు ఆదరణ
  • మాస్టర్ కార్డు, వీసా కార్డులకు తగ్గుతున్న మార్కెట్ వాటా

భారత మార్కెట్లో నిన్నటి వరకు కార్డు చెల్లింపుల్లో గుత్తాధిపత్యం చలాయించిన బహుళజాతి కంపెనీలు వీసా, మాస్టర్ కార్డుకు గడ్డు రోజులు వచ్చేశాయి. దేశీయంగా డిజిటల్ చెల్లింపుల శకం మొదలై, యూపీఐ తరహా కొత్త సాధనాలు రావడంతో కార్డు చెల్లింపులు తగ్గిపోతున్నాయి. మన దేశంలోని బ్యాంకులు అన్నీ కూడా మాస్టర్ కార్డు, వీసా కార్డు సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని ఆయా సంస్థలకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని ఏటీఎంల్లో, పీవోఎస్ లలోనూ, ఆన్ లైన్ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. ప్రతీ కార్డు లావాదేవీపై ఆయా కంపెనీలకు కొంత మేర చార్జీని బ్యాంకులు చెల్లిస్తుంటాయి.

అయితే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను దేశీయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంతో వీసా, మాస్టర్ కార్డులకు బ్యాడ్ టైమ్ మొదలైంది. దీనికితోడు రూపే కార్డును దేశీయంగానే అభివృద్ధి చేశారు. ఇప్పుడు బ్యాంకులు రూపే కార్డులను ఖాతాదారులకు అందిస్తున్నాయి. మరోవైపు యూపీఐ, యూపీఐ ఆధారిత భీమ్ యాప్ తీసుకురావడంతో డిజిటల్ చెల్లింపులు ఎక్కువవుతున్నాయి. క్రమక్రమంగా మన దేశంలో రిటైల్ దుకాణాల దగ్గర్నుంచి, ఎయిర్ లైన్ సంస్థలు, చివరికి స్టాక్ బ్రోకర్లు కూడా యూపీఐ ఆధారిత చెల్లింపులకు అనుమతిస్తున్న ధోరణి పెరుగుతోంది. యూపీఐ అనేది బ్యాంకు ఖాతా నుంచి నేరుగా మరో బ్యాంకు ఖాతాకు జమ చేసే ప్లాట్ ఫామ్. ఉదాహరణకు ఓ దుకాణాదారుడికి రూ.100 చెల్లించాలనుకుంటే యూపీఐ ద్వారా అతడి బ్యాంకు ఖాతాకు జమ చేయవచ్చు.

  • Loading...

More Telugu News