Steve Smith: క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం... వారిద్దరిపైనా లైఫ్ బ్యాన్!
- బాల్ ట్యాంపరింగ్ చేసిన స్మిత్, వార్నర్
- చేసిన నేరాన్ని అంగీకరించిన ఇద్దరూ
- ఒక్క మ్యాచ్ నిషేధం చాలదన్న విచారణ కమిటీ
- ఇంత మోసం చేస్తారా? అన్న మాల్కమ్ టర్నబుల్
కావాలనే బాల్ ట్యాంపరింగ్ చేశామని బహిరంగంగా చెప్పి ఆస్ట్రేలియా పరువు తీసిన క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లపై జీవితకాల నిషేధం విధించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. క్రికెట్ లో బాల్ ను ట్యాంపరింగ్ చేయడం అతిపెద్ద నేరాల్లో ఒకటని, ఈ పని చేసిన వాళ్లను జట్టులో కొనసాగనిస్తే, అది దేశ పరువు, ప్రతిష్ఠలపై విమర్శలు తెస్తుందని వెల్లడించిన అధికారులు, వారిద్దరినీ జట్టు నుంచి, క్రికెట్ నుంచి పూర్తిగా నిషేధించాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. వారు చేసిన నేరానికి కేవలం ఒక్క మ్యాచ్ నిషేధం విధించి వదిలేస్తే సరిపోదని, ఇది ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్తును నాశనం చేయకుండా చూడాలని వారు వెల్లడించినట్టు సమాచారం. కాగా, ఈ తరహా మోసం చేస్తున్నది మన క్రికెటర్లేనా? అని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్నబుల్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికన్నా అడుక్కోవడం నయమని, రోల్ మోడల్స్ గా ఉండాల్సిన ఆటగాళ్లు ఇలా మారిపోయారంటే నమ్మలేకున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు.