India: ఉత్తరాఖండ్ వరకూ దూసుకొచ్చిన చైనా మిలిటరీ చాపర్... తీవ్ర కలకలం!
- ఎయిర్ స్పేస్ నిబంధనలను గాలికొదిలిన చైనా
- నెల రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు
- తాజాగా ఉత్తరాఖండ్ లో హద్దులు దాటిన చైనా
- సీరియస్ వార్నింగ్ ఇచ్చిన భారత్
అంతర్జాతీయ ఎయిర్ స్పేస్ నిబంధనలను గాలికొదులుతూ, చైనాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్, ఇండియాలోకి దూసుకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖను దాటిన చైనా చాపర్, బరహోతీ రీజియన్ లోని చమోలీ జిల్లా వరకూ వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన భారత సైన్యం, ఆ హెలికాప్టర్ మరింత ముందుకు రాకుండా అడ్డుకుందని అధికారులు తెలిపారు. గడచిన నెల రోజుల వ్యవధిలో చైనా చాపర్లు సరిహద్దులు దాటి రావడం ఇది నాలుగోసారి. మార్చి 10వ తేదీన మూడు చైనా మిలిటరీ హెలికాప్టర్లు ఇదే ప్రాంతానికి వచ్చిన సంగతి తెలిసిందే. సరిహద్దులు దాటి ఐదు కిలోమీటర్ల దూరం లోపలికి వచ్చిన తరువాతనే హెలికాప్టర్ల గురించి భారత రక్షణ వర్గాలకు తెలిసింది. అంతకుముందు లడక్ ప్రాంతంలోనూ చైనా ఇదే పని చేసింది. మార్చి 8న జరిగిన ఈ ఘటనలో ఉదయం 8.55 గంటల ప్రాంతంలో రెండు చైనా హెలికాప్టర్లు 18 కిలోమీటర్ల దూరం చొరబడ్డాయి. మరోసారి ఇటువంటి ఘటనలు జరుగకుండా చూసుకోవాలని చైనా సైన్యానికి వార్నింగ్ ఇచ్చినట్టు సైన్యాధికారులు వెల్లడించారు.