Telangana: సెప్టెంబర్ లో ఆర్టీసీ ఎలక్ట్రానిక్ బస్సులు ప్రారంభిస్తాం: తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి
- కేంద్రం సహకారంతో ఈ- బస్సులను ప్రవేశపెడుతున్నాం
- తొలిదశలో 40, రెండో దశలో మరో 60 బస్సులను ప్రవేశపెడతాం
- ఈ- బస్సులను ఒకసారి చార్జీ చేస్తే కనీసం 4 గంటలు పని చేస్తాయి
- తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణ, ఖర్చు తగ్గించే తదితర ప్రయోజనాల కోసం వచ్చే సెప్టెంబర్ లో ఆర్టీసీ ఎలక్ట్రానిక్ బస్సులను ప్రారంభిస్తుందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో టీఎస్ ఆర్టీసీ ‘ఫేమ్ ఇండియా పథకం’ కింద కేంద్రం సహకారంతో 100 ఏసీ - ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్టనుందని, తొలిదశలో భాగంగా 40 బస్సులను ప్రారంభించేందుకు తగిన నిర్దేశాలు అందించామని అన్నారు.
అలాగే, రెండో దశలో మరో 60 బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులను ఒకసారి చార్జీ చేస్తే కనీసం 4 గంటలు పని చేస్తాయని, ఇలా 250 కిలోమీటర్ల దూరాన్ని 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే సామర్థ్యం ఉంటుందని అన్నారు. ఈ బస్సులను నడిపేందుకు ఆపరేటింగ్ సంస్థలను టెండర్ విధానం ద్వారా పిలిస్తే 5 సంస్థలు పాల్గొన్నట్టు చెప్పారు. తొలి విడత 40 బస్సులను నడిపే బిడ్ ను సిద్ధార్థ్ ఇన్ ఫ్రా టెక్ & సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుందని పేర్కొన్నారు.