David Warner: బ్రేకింగ్... ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కెప్టెన్ స్మిత్‌పై వేటు!
- బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్, వైస్ కెప్టెన్‌లపై వేటు
- గవర్నింగ్ బాడీతో చర్చల అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయం
- తాత్కాలిక కెప్టెన్‌గా వికెట్ కీపర్ టిమ్ పైనీ
దక్షిణాఫ్రికా జట్టుతో కేప్ టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వేటు వేసింది. గవర్నింగ్ బాడీతో చర్చల అనంతరం వారిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ టెస్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వికెట్ కీపర్ టిమ్ పైనీ వ్యవహరిస్తాడని వెల్లడించింది. "ఈ టెస్ట్ మ్యాచ్ కొనసాగాలి. అత్యవసరమనుకుంటే ఈ వ్యవహారాన్ని మ్యాచ్ ముగిసేలోగానే మేము విచారిస్తాం" అని సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ రోజు ఉదయం తాను చెప్పినట్లుగానే క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ల నుంచి సత్ప్రవర్తనను ఆశిస్తున్నారు. కేప్ టౌన్ టెస్టు మ్యాచ్ సందర్భంగా అలాంటి ప్రవర్తనా నియమావళి కనిపించలేదని సదర్లాండ్ వ్యాఖ్యానించారు. కాగా, నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా బలమైన స్థితిలో ఉన్న సమయంలో ఆస్ట్రేలియా ఇలా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.