Chandrababu: విజయ్ మాల్యాకు ఓ న్యాయం? విజయసాయిరెడ్డికి మరో న్యాయమా? : సీఎం చంద్రబాబు
- వీళ్లిద్దరూ ఆర్థిక నేరస్థులే .. వారి మధ్య వ్యత్యాసమేమీ లేదు!
- టీడీపీపై కావాలని చెప్పే బీజేపీ నేతల ఆరోపణలు
- ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు?
- కేంద్రంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు
విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయాడు, విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉంటున్నారని, వీళ్లిద్దరి మధ్య వ్యత్యాసం ఏముంది? అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాజకీయ పరిణామాలపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లో టీడీపీ ఎంపీలు, మంత్రులు, పార్టీ ప్రచార సారథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, వీళ్లిద్దరూ ఆర్థిక నేరస్థులేనని, వారి మధ్య వ్యత్యాసమేమీ లేదని, మరి, అలాంటప్పుడు విజయ్ మాల్యాకు ఓ న్యాయం? విజయసాయిరెడ్డికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. మాల్యా సభ్యత్వం రద్దు చేశారని, విజయసాయి సభ్యత్వం కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీపై కావాలని చెప్పే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించాలని సూచించారు. ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో అంశాలను అమలు చేయమని కోరితే, బీజేపీకి ఎందుకు అంత కోపం వస్తోంది? రాష్ట్రం కోసం పోరాడుతున్న తమపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? అని చంద్రబాబు ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, అదేవిధంగా, ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలని కేంద్రానికి హితవు పలికారు.
‘ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా? లేక రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా? ప్రజల హక్కుల కోసం పోరాడే టీడీపీ పక్షాన ఉంటారా? లేక ప్రజల మనోభావాలను నిర్లక్ష్యం చేసిన బీజేపీ వైపు ఉంటారా? అనే విషయాన్ని ఆయా పార్టీల నేతలే తేల్చుకోవాలి. టీడీపీకి మద్దతు ఇస్తే రాష్ట్రానికి మద్దతు ఇచ్చినట్టే’ అని చంద్రబాబు అన్నారు.