Harman Preeth kaur: అంతర్జాతీయ టీ-20ల్లో భారత మహిళల ప్రపంచ రికార్డు... అయినా తప్పని ఓటమి!

  • నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసిన భారత్
  • అంతర్జాతీయ మహిళల టీ-20ల్లో రెండో అత్యధిక స్కోరుగా రికార్డ్
  • మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయఢంకా మోగించిన ఇంగ్లాండ్

ముక్కోణపు టీ-20 సిరీస్‌లో భాగంగా ముంబైలో ఈ రోజు ఇంగ్లాండ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఫార్మాట్‌లో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కౌర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. మిథాలీ రాజ్ (53), మంథన (76), కౌర్ (30)లు ఇంగ్లీష్ బౌలర్లపై చెలరేగిపోవడంతో భారీ స్కోరు నమోదైంది. అయినా సరే కౌర్ సేనకు ఓటమి తప్పలేదు.

199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆది నుంచే ఇంగ్లాండ్ టీమ్ దూకుడు ప్రదర్శించింది. డేనియల్ వైట్ 64 బంతుల్లో 124 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 5 సిక్సర్లు, 15 బౌండరీలతో వైట్ భారత బౌలర్లపై విరుచుకుపడింది. బ్యూమౌంట్ (35) తన వంతు స్కోరు చేసినప్పటికీ, ఇంగ్లాండ్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించిన వైట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకుంది.

మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా భారీ స్కోరు ఛేదన పరంగా ఇంగ్లాండ్ తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది. గతేడాది కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో 180 పరుగుల స్కోరును ఛేదించిన ఇంగ్లాండ్ జట్టు...ఈ మ్యాచ్‌లో 198 పరుగుల భారీ స్కోను ఛేదించి ఔరా అనిపించుకుంది. కాగా, ఇప్పటివరకు అంతర్జాతీయ మహిళల టీ-20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్లలో దక్షిణాఫ్రికా (205/1) ఆగ్రస్థానంలో ఉంది.

Harman Preeth kaur
Mithali raj
T-20 Series
Mumbai
Danielle Wyatt
  • Loading...

More Telugu News