Rahul Gandhi: యూజర్ల సమాచారాన్ని పక్కదారి పట్టిస్తున్న నరేంద్రమోదీ యాప్!.. రాహుల్ గాంధీ విమర్శలు
- నరేంద్రమోదీ యాప్ నుంచి యూజర్ల సమాచారం మూడో పక్షానికి
- ఫ్రెంచ్ సంస్థ ఎలియట్ ఆల్డర్సన్ ఆరోపణలు
- వీటి ఆధారంగా ట్విట్టర్లో రాహుల్ గాంధీ వ్యంగ్య కామెంట్లు
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంబంధించిన మొబైల్ యాప్ ‘నరేంద్రమోదీ’ యూజర్ల డేటాను దుర్వినియోగం చేస్తోందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో రాహుల్ వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. ‘‘హాయ్ నా పేరు నరేంద్రమోదీ. నేను భారత ప్రధానమంత్రిని. మీరు నా మొబైల్ యాప్ లో సైన్ ఇన్ అయినప్పుడు మీ డేటా మొత్తాన్ని నేను అమెరికన్ కంపెనీల్లోని నా స్నేహితులకు చేరవేస్తాను’ అంటూ రాహుల్ గాంధీ ట్వీటారు.
ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ ఎలియట్ ఆల్డర్సన్ నరేంద్ర మోదీ యాప్ యూజర్ల సమాచారం దుర్వినియోగంపై ఆరోపణలు చేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని యాప్ మూడో పక్ష కంపెనీలకు అందిస్తోందన్నది ఆ సంస్థ ఆరోపణ. ‘‘నరేంద్ర మోదీ యాప్ లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ డివైజ్ సమాచారం (ఓఎస్, ఏ నెట్ వర్క్, క్యారియర్, వ్యక్తిగత డేటా అయిన ఈ మెయిల్, ఫొటో, జెండర్, పేరు తదితర సమాచారాన్ని మీ అనుమతి లేకుండానే in.wzrkt.com అనే థర్డ్ పార్టీ డొమైన్ కు చేరవేస్తోంది’ అని ఎలియట్ ఆల్డర్సన్ ట్విట్టర్లో పేర్కొంది. ఫేస్ బుక్ యూజర్ల సమాచారం లీక్ పై అధికారికంగా భారత్ వివరణ కోరిన సమయంలో ఈ అంశం తెరపైకి రావడం గమనార్హం.