ITC Ltd: తాజ్‌మహల్ దత్తతకు ప్రముఖ కంపెనీల పోటీ....!

  • తాజ్ మహల్ దత్తతకు ఐటీసీ, జీఎంఆర్‌ల పోటీ
  • కేంద్ర ప్రభుత్వ అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీం కింద దత్తతకు ప్రయత్నాలు
  • ఎర్రకోటని కూడా దత్తత తీసుకుంటామని జీఎంఆర్..చార్మినార్‌నీ తీసుకుంటామని ఐటీసీ వెల్లడి

మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ పట్ల ప్రేమకు గుర్తుగా యమునా నదీతీరాన కట్టించిన పాలరాతి కట్టడం 'తాజ్‌మహల్‌'ను దత్తత తీసుకునేందుకు జీఎంఆర్, ఐటీసీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ప్రేమమందిరాన్ని తాము దత్తత తీసుకుంటామంటూ ఆయా కంపెనీల ప్రతినిధులు కేంద్ర పర్యాటక శాఖకు లేఖలు కూడా రాశారు. గతేడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం వారసత్వ కట్టడాల దత్తత కోసం 'అడాప్ట్ ఏ హెరిటేజ్' పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీం కింద ప్రైవేటు, ప్రభుత్వ రంగ కంపెనీలు చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను, కట్టడాలను దత్తత తీసుకోవచ్చు.

దత్తత కంపెనీలు తాము దత్తత తీసుకునే వాటి నిర్వహణ కోసం తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) బడ్జెట్‌లో 2 శాతాన్ని చెల్లించే అవకాశముంది. దత్తత తీసుకున్నప్పటికీ, కట్టడాలు మాత్రం కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అజమాయిషీలోనే ఉంటాయి. కాగా, తాజ్‌మహల్‌కి ఉన్న గొప్పతనం దృష్ట్యా దానిని ఈ స్కీంలో చేర్చలేదని ఏఎస్ఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరిలో బడ్జెట్‌ని ప్రవేశపెడుతూ దేశంలోని పది చారిత్రక ప్రాశస్త్యమున్న పది కట్టడాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది.

తర్వాత తాజ్ మహల్‌ని కూడా ఈ స్కీమ్‌లో చేర్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుందని సదరు అధికారి చెప్పినట్లు 'హిందూస్థాన్ టైమ్స్' పత్రిక ఉటంకించింది. తాజ్ మహల్‌తో పాటు ఇతిమద్-ఉద్-దౌలాహ్ ఎర్రకోటలను కూడా దత్తత తీసుకునేందుకు పోటీ పడుతున్నట్లు జీఎంఆర్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఐటీసీ కూడా ఆంధ్రప్రదేశ్‌లోని శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న హిందూ దేవాలయాలు, హైదరాబాద్‌లోని చార్మినార్‌ను దత్తత తీసుకునేందుతు పోటీ పడుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News