Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఏపీకి కిరణ్ బేడీ?

  • పార్లమెంటు సమావేశాల తర్వాత కొత్త గవర్నర్ల నియామకం
  • ఏపీకి కిరణ్ బేడీ.. తెలంగాణకు సీవీఎస్కే శర్మ?
  • ఏపీకి ప్రత్యేక గవర్నర్ ఉండాలని కోరుతున్న బీజేపీ నేతలు

ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించే యోచనలో ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీని ఏపీకి పంపాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ గవర్నర్ గా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కే శర్మ పేరు కూడా కేంద్రం ప్రతిపాదనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన వెంటనే ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లను నియమించనుంది.

ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై జనవరి 11న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు లేఖ రాశారు. హైదరాబాదు నుంచి నరసింహన్ పని చేస్తుండటంతో... ఏపీకి ఆయన తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఏపీ ప్రజలు ఉన్నారని, ఏపీకి ప్రత్యేక గవర్నర్ ఉంటే బాగుంటుందనే విషయాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు.

మరోపక్క, ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో, ఏపీ గవర్నర్ గా కిరణ్ బేడీనే సరైన ఛాయిస్ అని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ఏపీలో రాజ్ భవన్ లేకపోయినప్పటికీ... గవర్నర్ కు తాత్కాలికంగా సౌకర్యాలు కల్పించవచ్చని బీజేపీ నేతలు తమ హైకమాండ్ కు చెప్పినట్టు తెలుస్తోంది.  

Andhra Pradesh
Telangana
governor
kiran bedi
  • Loading...

More Telugu News