PV Sindhu: వివాదంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ కుటుంబ సభ్యులు!
- ప్రభుత్వ ఖర్చుతో కామన్వెల్త్ పోటీలకు
- ఖండించిన సైనా, సింధు తల్లిదండ్రులు
- ప్రభుత్వ తీరుపై ‘ఒలింపిక్’ అధ్యక్షుడి ఆగ్రహం
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ కుటుంబ సభ్యులు వివాదంలో చిక్కుకున్నారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన సైనా తండ్రి హర్‌వీర్ సింగ్, సింధు తల్లి విజయ ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రయాణించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు క్రీడాకారుల తల్లిదండ్రులు ప్రభుత్వ నిధులతో పర్యటనలకు వెళ్తున్నారంటూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. అయితే అలా వెళ్తున్నది ఎవరన్న విషయాన్ని మాత్రం లేఖలో పేర్కొనలేదు.
కామెన్వెల్త్ గేమ్స్ కోసం తమ తల్లిదండ్రులను కూడా తమతోపాటు తీసుకెళ్తామని, ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలంటూ క్రీడాకారులు పెట్టుకున్న అభ్యర్థనకు క్రీడాశాఖ అంగీకరించలేదు. క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర ధ్రువ్ బాత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ, సచిన్ వంటి వారికైతే ప్రభుత్వం వెంటనే కాదనకుండా నిధులు మంజూరు చేస్తుందని మండిపడ్డారు.
తాజా వివాదంపై సింధు తండ్రి రమణ మాట్లాడుతూ.. సింధుతో కలిసి టోర్నమెంటులకు వెళ్లిన ప్రతిసారీ తన ఖర్చులు తానే భరించేవాడినని పేర్కొన్నారు. ఈసారి తన సతీమణి కూడా సొంత డబ్బులతోనే వెళ్లిందని స్పష్టం చేశారు. ఇవి తప్పుడు ఆరోపణలన్నారు. సైనా తండ్రి హర్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఓ సాధారణ ప్రేక్షకుడిలా మ్యాచ్ చూసేందుకు సొంత డబ్బులతో వెళ్తున్నానని స్పష్టం చేశారు.