vriddiman saha: వృద్ధిమాన్ సాహా ఊచకోత.. 20 బంతుల్లో 102 పరుగులు!
- 14 సిక్సర్లు, 4 ఫోర్లతో విరుచుకుపడ్డ సాహా
- అమన్ ఓవర్లో ఆరు సిక్సర్లు
- 8 బంతుల్లోనే సెకండ్ ఫిఫ్టీ
తాను టెస్ట్ బ్యాట్స్ మెన్ మాత్రమే కాదని... పరిమిత ఓవర్లలో సైతం పంజా విసరగలనని టీమిండియా బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహా నిరూపించాడు. తనలో కూడా నిర్దాక్షిణ్యంగా వేటాడే వేటగాడు ఉన్నాడని చాటి చెప్పాడు. ఐపీఎల్ ఆరంభం కావడానికి ముందు తన విశ్వరూపం ప్రదర్శించి అందర్నీ షాక్ కు గురి చేశాడు. కేవలం 20 బంతుల్లోనే ఏకంగా 102 పరుగులు చేసి 'ఔరా' అనిపించాడు. దీనికి కోల్ కతాలో జరిగి జేసీ ముఖర్జీ ట్రోఫీ ఇంటర్ క్లబ్ టీ-20 మ్యాచ్ వేదికైంది. ఈ టోర్నీలో మోహన్ బగన్ జట్టు తరపున సాహా ఆడాడు. నిన్న బెంగాల్ నాగ్ పూర్ రైల్వేస్ పై జరిగిన మ్యాచ్ లో సాహా ఈ ఫీట్ సాధించాడు.
తాను ఎదుర్కొన్న 20 బంతుల్లో 14 బంతులను బౌండరీ అవతలికి తరలించాడు సాహా. మిగిలిన 6 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సింగిల్స్ తీశాడు. ఏడో ఓవర్లో మీడియం పేసర్ అమన్ ప్రసాద్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఒక వైడ్ సహా ఆ ఓవర్లో అమన్ 37 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి హాఫ్ సెంచరీకి 12 బంతులు తీసుకున్న సాహా... రెండో హాఫ్ సెంచరీని 8 బంతుల్లోనే సాధించాడు. సాహా ధాటికి మోహన్ బగన్ వికెట్ కోల్పోకుండానే విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7 ఓవర్లలోనే ఛేదించింది.