BJP: ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం.. అవిశ్వాసానికి రెడీ!
- అవిశ్వాసం చర్చకు రాకుండా టీఆర్ఎస్, అన్నాడీఎంకేలను బీజేపీ పురికొల్పుతోందంటున్న ప్రతిపక్షాలు
- పూర్తి బలం ఉన్నప్పుడు చర్చకు వెనకడుగు ఎందుకంటున్న సొంత పార్టీ ఎంపీలు
- అవిశ్వాసంపై చర్చించాలని నిర్ణయానికి వచ్చిన బీజేపీ
ఆంధ్ర్రప్రదేశ్‌ను కేంద్రం అడుగడుగునా మోసం చేస్తోందని ఆరోపిస్తూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని మోదీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అవిశ్వాసానికి భయపడుతున్న ప్రభుత్వం అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి చర్చ జరగకుండా అడ్డుకుంటోందన్న ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తమకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి చర్చకు వెళ్లడమే సరైనదని బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. పార్లమెంటు ప్రతిష్ఠంభనపై పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో అధిష్ఠానం ఈ నిర్ణయానికి వచ్చింది.
చర్చకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించడంతో మంగళవారం అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం అసోంలోని గువాహటిలో ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ పార్లమెంటులో అవిశ్వాసం తీసుకురావాల్సిందిగా సవాలు విసరడం అందులో భాగమేనని చెబుతున్నారు. అలాగే ఈ సమావేశాల్లో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్, అన్నాడీఎంకేలకు నిర్దిష్ట హామీ కూడా ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.