Chandrababu: ఎందుకీ దాగుడు మూతలు?: చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు

  • కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో లెక్కలు వివరించాలి
  • అధికారులతో కమిటీ వేసి లెక్కలు కట్టి ప్రజలకు తెలియచేయవచ్చుగా?
  • ప్రత్యేక హోదాపై వామపక్షాలతో త్వరలో సమావేశం

భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాయడం, దానికి ప్రతిగా చంద్రబాబు శాసనసభలో సుదీర్ఘంగా జవాబు ఇవ్వడం చూస్తుంటే ప్రత్యేక హోదా బీజేపీ ఎప్పటికీ ఇవ్వదని అనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగే హోదాను సాధించే స్థితిలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం లేదన్న సంగతిని ప్రజలు మరింత అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. తాము వేలాది కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చామని, వాటిని ఖర్చు చేయడంలో టీడీపీ విఫలమైందని పాడిన పాటనే అమిత్ షా మళ్లీ పాడారని అన్నారు. అదేమాదిరిగా ఎప్పటిలాగానే, ఆంధ్రప్రదేశ్ కు ఎన్డీఏ ప్రభుత్వం అన్యాయం చేసిందని చంద్రబాబు మరోసారి ఘోషించారని అన్నారు.

"ఎందుకీ దాగుడు మూతలు? కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఇరు ప్రభుత్వాలకు చెందిన అధికారులను కమిటీగా వేసి లెక్కలు కట్టి ప్రజలకు తెలియచేయవచ్చుగా? జనసేన చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అధ్యయనంలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయవచ్చుగా? ఎంతకాలం ఈ ముసుగులో గుద్దులాట? విసిగి వేసారిన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరవధిక ఆందోళనలకు దిగే పరిస్థితులను దయచేసి కల్పించ వద్దని జనసేన పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది.

ప్రత్యేక హోదా తప్ప మిగిలిన వాటి గురించి వినే స్థితిలో ప్రజలు లేరనే యథార్థాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిది. బీజేపీ, తెలుగుదేశం పార్టీల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితిపై చర్చించడానికి త్వరలో వామపక్ష పార్టీల నాయకులతో చర్చలు జరపనున్నాము. ప్రజల కోరికను నెరవేర్చడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తాము. ఆ తరువాత లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ వంటి అనుభవజ్ఞులతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, మేధావులతో కూడా సమాలోచనలు జరుపుతాము" అని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Chandrababu
Pawan Kalyan
amith shah
  • Loading...

More Telugu News