Mayawati: ప్రజాస్వామ్యాన్ని కాషాయ పార్టీ అపహాస్యం చేసిందనడానికి ఈ ఎన్నికలే నిదర్శనం!: మాయావతి
- భవిష్యత్తులోనూ ఎస్పీ-బీఎస్పీ పొత్తు కొనసాగుతుందని ప్రకటన
- మోదీ, అమిత్ షా తమను ఒక్క ఇంచు కూడా కదపలేరని వ్యాఖ్య
- ప్రజల్లో విశ్వాసముంటే గోరఖ్ పూర్, ఫూల్ పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోతుందని విమర్శ
రాజ్యసభ ఫలితాలు నిరాశ పరిచినప్పటికీ, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)-బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మధ్య పొత్తు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన తమ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సింగ్ను ఆమె సస్పెండ్ చేయనున్నట్లు సమచారం. లక్నోలో ఆమె మీడియాతో మాట్లాడుతూ....ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తమను ఒక్క ఇంచు కూడా కదపలేరని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యాన్ని కాషాయ పార్టీ అపహాస్యం చేసిందని చెప్పడానికి తాజా రాజ్యసభ ఎన్నికల ఓటింగే నిదర్శమని ఆమె దుయ్యబట్టారు. బీజేపీ ఓటమి భయంతో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిందని ఆమె ఆరోపించారు. ప్రజలు బీజేపీని విశ్వసించి ఉంటే గోరఖ్ పూర్, ఫూల్ పూర్ లోక్సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోతుందని ఆమె ప్రశ్నించారు. యూపీ రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం పది సీట్లకు బీజేపీ 9 కైవసం చేసుకోగా ఎస్పీ ఒక సీటును గెలుచుకున్న సంగతి తెలిసిందే.