MOBILE subscribers: జియో కస్టమర్ల సంఖ్య 16.84 కోట్లు... అయినా నంబర్ 1 ఎయిర్ టెల్!
- జనవరి నాటికి ఎయిర్ టెల్ కస్టమర్ల సంఖ్య 29.16 కోట్లు
- రెండో స్థానంలో వొడాఫోన్... 21.38 కోట్ల కస్టమర్లు
- మూడో స్థానంలో ఐడియా, నాలుగో స్థానంలో జియో
ఈ ఏడాది జనవరి నాటికి రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య 16.84 కోట్లకు చేరింది. అయినప్పటికీ 29.16 కోట్ల మందితో భారతీ ఎయిర్ టెల్ సంస్థ అత్యధిక కస్టమర్లను కలిగిన సంస్థగా నంబర్ 1 స్థానంలో నిలిచింది. వొడాఫోన్ సంస్థ 21.38 కోట్ల కస్టమర్లతో రెండో స్థానంలో ఉండగా, ఐడియా 19.76 కోట్ల కస్టమర్లతో మూడో స్థానంలో ఉంది. ఇక బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు 10.38 కోట్లకు చేరారు. జూన్ నాటికి ఐడియా, వొడాఫోన్ విలీనమై ఒకే సంస్థగా ఏర్పడనున్నాయి. దీంతో ఉమ్మడి సంస్థ సుమారు 41 కోట్ల కస్టమర్లతో పరిశ్రమలో నంబర్ 1 స్థానానికి చేరే అవకాశం ఉంటుంది.
ఇక జనవరి నెలలో కొత్త కస్టమర్లను ఎక్కువ మందిని సంపాదించింది మాత్రం రిలయన్స్ జియోనే. 83 లక్షల మంది జియో నెట్ వర్క్ లో చేరారు. ఎయిర్ టెల్ కు 15 లక్షలు, వొడాఫోన్ కు 13 లక్షలు, ఐడియాకు 11 లక్షలు, బీఎస్ఎన్ఎల్ కు 3.96 లక్షల మంది కస్టమర్లు జతయ్యారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ సర్వీసెస్, ఎయిర్ సెల్, టెలినార్ చాలా వరకు కస్టమర్లను కోల్పోయాయి. టెలీనార్ సంస్థను ఎయిర్ టెల్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే టెలినార్ ఎయిర్ టెల్ లో విలీనమవుతుంది. అలాగే టాటా టెలీసర్వీసెస్ (డొకోమో సైతం) కూడా ఎయిర్ టెల్ లో కలసిపోనుంది. ఇక ఆర్ కామ్ సేవలను నిలిపివేయగా, ఎయిర్ సెల్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంస్థ సర్వీసుల నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది.