Rajya Sabha: రాజ్యసభలో పెరిగిన బీజేపీ బలం... కాంగ్రెస్ కు తగ్గిన స్థానాలు... తాజా సంఖ్యా బలాలు ఇవీ!
- 11 స్థానాలు పెరిగి 69కి చేరిన బీజేపీ బలం
- నాలుగు స్థానాలు చేజార్చుకుని 50కి పరిమితమైన కాంగ్రెస్
- పెద్దల సభలో ఇక బీజేపీ ఆధిపత్యం
58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రధాన జాతీయ పార్టీల సంఖ్యా బలంలో మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీ బలం పెరగ్గా, కాంగ్రెస్ బలం తగ్గింది. మొత్తం మీద కాంగ్రెస్ కు నాలుగు స్థానాలు తగ్గిపోయాయి. తాజా ఎన్నికల అనంతరం 245 స్థానాలు కలిగిన పెద్దల సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 58 నుంచి 69కు చేరుకుంది. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 54 నుంచి 50కు తగ్గింది. బీజేపీ 11 స్థానాలను పెంచుకుని మెజారిటీకి చేరింది. తద్వారా పెద్దల సభలో ఇన్నాళ్లు కాంగ్రెస్, ప్రతిపక్షాలదే పై చేయిగా ఉండగా, ఇప్పుడు బీజేపీ బలం కాంగ్రెస్ ను మించిపోయింది.
అయితే, ఇన్నాళ్లూ పెద్దల సభలో టీడీపీకి ఉన్న ఆరుగురు సభ్యులు ఎన్డీయేకు తోడుగా ఉండగా, ఇటీవల దూరమైన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ స్వీయబలం 11 సీట్లు పెరిగినప్పటికీ టీడీపీ రూపంలో ఆరు స్థానాల బలం తగ్గినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అయితే, టీఆర్ఎస్ తాజాగా మూడు స్థానాలు గెలవడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతుతో ఎన్డీయే బలంగానే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.