alllu sireesh: గవర్నమెంటు స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పిన సినీ నటుడు అల్లు శిరీష్
- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు తరగతులు నిర్వహిస్తున్న పెగా టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ
- పలువురు సెలబ్రిటీలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల పాఠ్యబోధన చేయిస్తున్న వైనం
- విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధించిన అల్లు శిరీష్
యువ సినీనటుడు అల్లు శిరీష్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి అవతారం ఎత్తాడు. పెగా టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ తరగతులు బోధిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ సంస్థ పలువురు సెలబ్రిటీలతో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధింపజేస్తోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెం.5 లోని దేవరకొండ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4, 5 తరగతుల విద్యార్థులకు సినీ నటుడు అల్లు శిరీష్ తో పాఠాలు చెప్పించింది. గెస్ట్ టీచర్ గా అల్లు శిరీష్ రెండు గంటల సేపు విద్యార్థులకు పాఠాలు బోధించాడు. విద్యార్థులకు సరదాగా ప్రశ్నలు వేస్తూ ఆంగ్లంలో సమాధానాలు రాబట్టాడు. క్లాసు అనంతరం చిన్నారులతో శిరీష్ ఫొటోలు దిగాడు. ఆ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ, ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజన్నాడు. పిల్లలకు పాఠాలు చెప్పడం అద్భుతంగా ఉందని, తనకు తన స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని ఆనందం వ్యక్తం చేశాడు.