soumyajit ghose: ఒలింపియన్ పై రేప్, అబార్షన్ కేసు... కామన్వెల్త్ గేమ్స్ బృందం నుంచి ఉద్వాసన!

  • పెళ్లి చేసుకుంటానని లోబరచుకుని అబార్షన్ చేయించాడంటూ టీటీ క్రీడాకారుడు సౌమ్యజిత్ ఘోష్ పై కేసు
  • బాలిక ఆరోపణలను ఖండించి, ఆమెతో కలిసి ఉన్నానని అంగీకరించిన సౌమ్యజిత్
  • కేసు నమోదు కావడంతో కామన్వెల్త్ గేమ్స్ బృందం నుంచి ఉద్వాసన

ఒలింపిక్స్ లో రెండు సార్లు భారత్ కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుడిపై రేప్, అబార్షన్ కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... వెస్ట్ బెంగాల్‌ కు చెందిన సౌమ్యజిత్‌ ఘోష్ (24) 2013లో టేబుల్ టెన్నిస్ లో జాతీయ చాంపియన్‌ గా అవతరించాడు. అదే సంవత్సరం బ్రెజిల్‌ ఓపెన్‌ ను కూడా గెల్చుకున్నాడు. 2014లో గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌ లో సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో క్వార్టర్స్‌ కు చేరుకున్నాడు, రెండు సార్లు (2012, 2016) ఒలింపిక్స్‌ లో పాల్గొన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతనికి అర్జున అవార్డు కూడా దక్కింది.

కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనేందుకు జర్మనీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం తనపై ఘోష్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి (18) కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడని, తద్వారా గర్భం దాల్చగా కల్లబొల్లి కబుర్లు చెప్పి అబార్షన్ చేయించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లిపై ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో విసుగెత్తి పోలీసులను ఆశ్రయించానని వెల్లడించింది. దీంతో పోలీసులు, సౌమ్యజిత్‌ ఘోష్‌ పై అత్యాచారం (ఐపీసీ 376 సెక్షన్‌), మోసం (417 సెక్షన్‌), మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం చేయించడం (313 సెక్షన్‌), మైనర్లపై లైంగికదాడి కేసులు నమోదు చేశారు.

దీనిపై వేగంగా స్పందించిన కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సౌమ్యజిత్‌ ను కామన్వెల్త్‌ కు వెళ్లే బృందం నుంచి తప్పించినట్లు ప్రకటించింది. ఆమె ఆరోపణలను ఖండించిన సౌమ్యజిత్ మాట్లాడుతూ, ఆమె తనకు బాగా తెలుసని అన్నాడు. ఆమె తల్లిదండ్రులతో కూడా తనకు సత్సంబంధాలున్నాయని అన్నాడు. తామిద్దరం కలిసే ఉన్నామని, అయితే కెరీర్ కోసం ఆమెకు దూరమవుతున్నానని చెప్పానని అన్నాడు. ఏడాదిన్నర కాలంగా ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందని సౌమ్యజిత్ తెలిపాడు.  

  • Loading...

More Telugu News