Jayalalitha: శశికళ కేసులో మరో ట్విస్ట్.. చికిత్స సమయంలో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసిన అపోలో!
- 24 బెడ్‌లున్న ఐసీయూలో జయ ఒక్కరికే చికిత్స
- ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు సీసీ కెమెరాలు కట్
- స్వయంగా వెల్లడించిన ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కేసులో మరో ట్విస్ట్. తీవ్ర అస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రిలో జయ చేరిన తర్వాత ఐసీయూల సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఐసీయూలో ఆమెకు చికిత్స అందించినన్ని రోజులు సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేసినట్టు అపోలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. జయ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరిన తర్వాత అక్కడి రోగులను ఇతర ఐసీయూలకు తరలించినట్టు చెప్పారు. 24 బెడ్‌లు ఉన్న ఐసీయూ మొత్తాన్ని ఆమెకే కేటాయించినట్టు చెప్పారు. ఆమెను ఎవరూ చూడకూడదనే ఉద్దేశంతోనే సీసీ టీవీ కెమెరాలను స్వీచ్చాఫ్ చేసినట్టు వివరించారు.
జయలలితకు ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలను జస్టిస్ అర్ముగస్వామి కమిటీకి అందించినట్టు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. జయ అపస్మారక స్థితిలోనే ఆసుపత్రిలో చేరినట్టు చెప్పిన ప్రతాప్ రెడ్డి డిశ్చార్జ్ చేసే సమయం వచ్చిందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో ఆమె మృతి చెందినట్టు వివరించారు.