Lalu prasad yadav: హత్య కేసులో లాలూ కుమారుడికి ఊరట

  • జర్నలిస్ట్ రాజ్‌దేవ్ రంజన్ కేసులో లాలూ కుమారుడు తేజ్‌పై తదుపరి విచారణ అవసరం లేదన్న సుప్రీంకోర్టు
  • ఈ హత్యతో తేజ్‌కు సంబంధాన్ని తెలిపే ఆధారాలు లేవని పేర్కొన్న సీబీఐ 
  • ఏవైనా ఆధారాలుంటే పాట్నా హైకోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కి న్యాయస్థానం సూచన

సివాన్‌ జిల్లాకి చెందిన జర్నలిస్ట్ రాజ్‌దేవ్ రంజన్ హత్య కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కి భారీ ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయనపై తదుపరి విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ హత్యతో తేజ్ ప్రతాప్‌కు సంబంధముందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ సీబీఐ చెప్పడంతో కోర్టు ఈ మేరకు తీర్పునివ్వడం గమనార్హం. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు మహ్మద్ కైఫ్, జావేద్‌లపై మాత్రం విచారణ కొనసాగుతోందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనానికి దర్యాప్తు సంస్థ తెలిపింది.

నిందితులిద్దరూ ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తన భర్త హత్య కేసులో తేజ్ ప్రతాప్ పాత్రపై విచారణ చేపట్టాలంటూ జర్నలిస్ట్ భార్య ఆషా రంజన్ దాఖలు చేసిన పిటిషన్‌కు సీబీఐ ఈ మేరకు కోర్టుకు స్పష్టం చేయడం గమనార్హం. సీబీఐ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు తేజ్ ప్రతాప్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఏవైనా ఆధారాలున్నాయని తెలిస్తే పాట్నా హైకోర్టును ఆశ్రయించవచ్చని పిటిషన్‌దారుకు కోర్టు సూచించింది. కాగా, మే 13, 2016న ఆఫీసు నుంచి తిరిగొస్తుండగా రాజ్‌దేవ్ రంజన్‌ను సివాన్ జిల్లాలో కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News