Hardik pandya: అంబేద్కర్‌ను అవమానించేలా హార్థిక్ పాండ్యా ట్వీట్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆదేశం
- దేశంలోకి రిజర్వేషన్లనే రోగాన్ని ఎక్కించారంటూ పాండ్యా వివాదాస్పద ట్వీట్
- అంబేద్కర్‌ను అవమానించడంతో పాటు ఆ వర్గ మనోభావాలను దెబ్బతీశారంటూ కోర్టుకెక్కిన న్యాయవాది
- రాజ్యాంగ నిర్మాణాన్ని అవహేళన చేశాడంటూ మండిపాటు
అంబేద్కర్‌ను అవమానించేలా ట్వీట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై కేసు నమోదు చేయాల్సిందిగా ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు పోలీసులను ఆదేశించింది. గతేడాది డిసెంబరు 26న పాండ్యా చేసిన ట్వీట్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించేలా ఉందంటూ డీఆర్ మేఘ్‌వాల్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాండ్యా తన ట్వీట్‌తో అంబేద్కర్‌ను, ఆ సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీశాడని అందులో పేర్కొన్నారు.
రిజర్వేషన్లు అనే వ్యాధిని దేశంలో వ్యాప్తి చేసిన అంబేద్కర్.. అంటూ పాండ్యా చేసిన ట్వీట్ అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. పాండ్యా లాంటి పాప్యులర్ క్రికెటర్ ఇటువంటి ట్వీట్లు చేయడం సమంజసం కాదన్న పిటిషన్‌దారు ఆ వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రాజ్యంగాన్ని తూలనాడాడని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాణాన్ని అపహాస్యం చేశాడని ఆరోపించారు.
మనోభావాలను దెబ్బతీసిన పాండ్యా చాలా పెద్ద నేరం చేశాడని న్యాయవాది అయిన పిటిషన్‌దారు పేర్కొన్నారు. అతడు చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందేనన్నారు. కాగా, పిటిషన్‌ను స్వీకరించిన ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.