Vijay shakar: కార్తీక్ ఆ సిక్సర్ కొట్టకుంటే.. వామ్మో, తలచుకుంటేనే భయమేస్తోంది: విజయ్ శంకర్
- 15 నిమిషాల్లోనే అన్ని ఉద్వేగాలు అనుభవించా
- నా కెరీర్‌ను కాపాడిన కార్తీక్‌కు కృతజ్ఞతలు
- కార్తీక్ ఇచ్చిన ధైర్యంతోనే ఆ రాత్రి నిద్ర పోగలిగా
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ కనుక చివరి బంతికి సిక్సర్ కొట్టకపోయి ఉంటే తన కెరీర్‌కు అదే చివరి మ్యాచ్ అయి ఉండేదని టీమిండియా ఆటగాడు విజయ్ శంకర్ పేర్కొన్నాడు. నాటి ఘటనను తలచుకుంటే ఇప్పటికీ భయం వేస్తోందన్నాడు. కార్తీక్ సిక్సర్ కొట్టి తనను బతికించాడని పేర్కొన్నాడు. ఆ సిక్సర్ కొట్టకుంటే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయంగా ఉందన్నాడు. అత్యవసర పరిస్థితుల్లో బంతులు తింటూ క్రీజులో ఉన్న విజయ్ శంకర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు అయితే క్రికెట్ ఆడడానికి విజయ్ పనికిరాడంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు.
నాటి ఘటనపై శంకర్ స్పందించాడు. పావుగంట సమయంలోనే జీవితంలో అన్నింటినీ అనుభవించేశానని పేర్కొన్నాడు. ఒత్తిడి, బాధ, ఆందోళన, ఆనందం.. అన్నీ ఆ 15 నిమిషాల్లోనే అనుభవించానన్నాడు. సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన కార్తీక్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నాడు. ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవడం వల్లే బ్యాట్‌ను కదిలించలేకపోయానన్నాడు.
బంతి ఎక్కడ పడుతుందన్న విషయాన్ని గుర్తించకుండా ఆడడమే తాను చేసిన పెద్ద తప్పు అని అంగీకరించాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత గదిలోకి వెళ్లి తలుపేసుకుంటే మిత్రుడు కార్తీక్ వచ్చి తలుపుతట్టాడని వివరించాడు. తమిళనాడుకు ఆడే సమయంలో ఎంతో నేర్పించిన కార్తీక్ క్లిష్ట సమయంలో మరోసారి తనను ఓదార్చాడన్నాడు. అతడు ఇచ్చిన ధైర్యంతో ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని విజయ్ శంకర్ గుర్తు చేసుకున్నాడు.