west indies: హమ్మయ్య.. విండీస్ గట్టెక్కింది.. ప్రపంచకప్‌కు అర్హత సాధించిన కరీబియన్ జట్టు!

  • విండీస్‌ను గట్టెక్కించిన వరుణుడు
  • డక్‌వర్త్ లూయిస్ విధానంలో స్కాంట్లాండ్‌పై విజయం
  • ఫైనల్‌కు చేరుకున్న కరీబియన్ జట్టు

మొత్తానికి విండీస్ గట్టెక్కింది. ఒకప్పుడు జగజ్జేతగా, ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటిగా కీర్తినందుకున్న విండీస్‌ ఇటీవల పసికూనల స్థాయికి పడిపోయింది. ప్రపంచకప్‌కు ఉత్తీర్ణత సాధించలేక క్వాలిఫయర్స్ మ్యాచుల్లో ఆడాల్సిన దుస్థితికి చేరుకుంది. అయితే ఈ టోర్నీలో నిలకడగా రాణించిన కరీబియన్ జట్టు ఎట్టకేలకు 2019 ప్రపంచకప్‌కు అర్హత సాధించి ఊపిరి పీల్చుకుంది. బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ విధానంలో విండీస్ విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 105 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోవడంతో విండీస్ విజయం ఖాయమని భావించారు. అయితే 31.4 ఓవర్ల వద్ద 125/5తో ఉన్న సమయంలో వర్షం పడడంతో ఆటకు అంతరాయం కలిగింది. వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో విండీస్ ఐదు పరుగుల తేడాతో నెగ్గినట్టు ప్రకటించారు.

వర్షం పడే సమయానికి స్కాట్లాండ్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఉంటే ఆ జట్టే విజయం సాధించి ఉండేది. అయితే వరుణుడి కారణంగా విండీస్ ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకోగలిగింది. కాగా, ఐదో వికెట్‌గా వెనుదిరిగిన స్కాట్లాండ్ బ్యాట్స్‌మన్ బెరింగ్టన్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. అతడు కనుక అవుటవకపోయి ఉంటే విండీస్ రాత మారి ఉండేది. సూపర్ సిక్సెస్‌లో 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న విండీస్ ఈనెల 25న జరగనున్న ఫైనల్‌కు అర్హత సాధించింది.

west indies
Cricket
world cup
  • Loading...

More Telugu News