haribabu: రాజకీయ ప్రయోజనాలతోనే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు: బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు
- ఎన్నికలు సమీపిస్తున్నందుకే ఇటువంటి వ్యూహాలు
- అవిశ్వాసం చర్చకు వస్తే ఏపీకి చేసిన మేలు వివరించేందుకు మేము సిద్ధం
- ఇది మాకు కూడా ఓ అవకాశం
- మూడున్నరేళ్లలో ఏపీకి ఏమిచ్చామో చెబుతాం
ఎన్నికలు సమీపిస్తున్నందుకే టీడీపీ, వైసీపీలు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అవిశ్వాస తీర్మానం పెడుతున్నాయని బీజేపీ ఏపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం కోసం టీడీపీ, వైసీపీలు నోటీసులు ఇస్తున్నప్పటికీ సభలో ఆ విషయంపై చర్చించడానికి సాధ్యం కావట్లేదన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కంభంపాటి హరిబాబు పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఏపీకి చేసిన మేలు వివరించేందుకు తాము సిద్ధమని అన్నారు.
అన్ని విషయాలను వివరించడానికి ఇది తమకు కూడా ఓ అవకాశమని చెప్పుకొచ్చారు. మూడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏమిచ్చిందో చెబుతామని అన్నారు. అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో చర్చకు వస్తుందా? రాదా? అనేది సభ జరిగే విధానంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎలా గెలవాలనే కోణంలోనే టీడీపీ, వైసీపీలు కొన్ని వ్యూహాలు రచించుకుంటున్నాయని ఆరోపించారు.