Yanamala: పోలవరంకు నిధులు ఆపడం కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు: యనమల
- అవిశ్వాసం పెట్టినంత మాత్రాన కేంద్రం నిధులు ఆపలేదు
- కేంద్రం కనుసన్నల్లోనే పోలవరం పనులు జరుగుతున్నాయి
- అవిశ్వాసంపై చర్చ జరగకుండా కేంద్రమే అడ్డుకుంటోంది
లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నది కేంద్రమేనని ఆయన అన్నారు. దీనిపై చర్చ జరపాల్సిన బాధ్యత స్పీకర్ సుమిత్రా మహాజన్ పై ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసినట్టే... ఇప్పుడు బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
నిబంధనలకు అనుగుణంగానే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు వస్తాయని... అవిశ్వాసం పెట్టినంత మాత్రాన పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఆపడం కేంద్రం వల్ల కాదని చెప్పారు. కేంద్రం కనుసన్నల్లోనే పోలవరం నిర్మాణం పనులు జరుగుతున్నాయని... ఇక దేనిపై విచారణ జరుపుతారని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ కిందే పనులు జరుగుతున్నాయని చెప్పారు. పార్లమెంటులో ఆందోళనలు జరుగుతున్నా అవసరమైన బిల్లులను ఆమోదింపజేసుకుంటున్నారని... అవిశ్వాసంపై చర్చకు మాత్రం ఆందోళనలు అడ్డొస్తున్నాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.