Shami: సీఎం మమతా బెనర్జీకి తన దుస్థితి వివరించనున్న క్రికెటర్ షమీ భార్య
- ఈ నెల 23న పశ్చిమ బెంగాల్ సీఎంని కలవనున్న క్రికెటర్ షమీ భార్య
- ఆమె వద్ద తన దుస్థితిని వెల్లడించే అవకాశం
- తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, షమీ అతని కుటుంబసభ్యులను అరెస్టు చేయాలని డిమాండ్
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ అతని భార్య హసీన్ జహాన్ కొన్ని రోజులుగా వార్తల్లో వ్యక్తులుగా మారారు. తన భర్తపై వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన హసీన్...తాజాగా తన గోడును వినిపించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసేందుకు సిద్ధమవుతోంది. సీఎంను నిన్న కలిసేందుకు ప్రయత్నించగా అది కుదరలేదని, ఈ నెల 23న ఆమెను కలుస్తానని చెప్పింది. తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, షమీని, అతని కుటుంబసభ్యులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
మరోవైపు మహ్మద్ షమీపై జహాన్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ గతనెల 17, 18 తేదీల్లో అతను దుబాయ్‌లోనే ఉన్నట్లు ధ్రువీకరించింది. గతనెలలో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత పాకిస్థాన్ మోడల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న షమీ ఆమెని కలవడానికి దుబాయ్ వెళ్లాడని జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాక మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఇంగ్లాండ్‌కి చెందిన ఓ వ్యాపారి నుంచి డబ్బులు తీసుకున్నాడని కూడా ఆమె సంచలన ఆరోపణ చేసింది. ఆమె చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ...గతనెల 17, 18 తేదీల్లో షమీ దుబాయ్‌లోనే ఉన్నట్లు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.