KCR: 24 వేల కోట్లు ఇవ్వాలని అడిగితే... 24 రూపాయలు కూడా ఇవ్వలేదు: కేసీఆర్ ఫైర్
- మిషన్ బగీరథ, మిషన్ కాకతీయలను నీతి ఆయోగ్ మెచ్చుకుంది
- కేంద్ర నిధుల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది
- అప్పులపాలయిందంటూ మన రాష్ట్రాన్ని మనమే కించపరుచుకోవడం దారుణం
తెలంగాణ శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర నిధులను తెచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని ఆయన అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలను నీతి ఆయోగ్ మెచ్చుకుని, నిధులు ఇవ్వాలంటూ కేంద్రానికి సూచించిందని చెప్పారు. రూ. 24 వేల కోట్లు కావాలని తాము అడిగితే.. కేంద్రం 24 రూపాయలను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
జీడీపీలో 21 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని... ఇంకా అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు ఉందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం అప్పులపాలయిందని విపక్షాలు అనడం మంచిది కాదని... మన రాష్ట్రాన్ని మనమే కించపరుచుకుంటే ఎలాగని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉందని... అందులో 40 వేల టీఎంసీల నీటిని ఉపయోగించుకున్నా... ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని చెప్పారు.