cdr scame: బాలీవుడ్ లో కలకలం రేపుతున్న కాల్ డేటా రికార్డ్ స్కాం
- బాలీవుడ్ లో కలకలం రేపిన సీడీఆర్ స్కాం
- భార్యపై అనుమానంతో లాయర్ కి ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి రికార్డులు కోరిన నవాజుద్దీన్ సిద్దిఖీ
- జాకిష్రాఫ్ భార్య అయేషా, కంగనా రనౌత్ లకు నోటీసులు జారీ చేసిన థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
బాలీవుడ్ లో కాల్ డేటా రికార్డ్ ( సీడీఆర్ ) స్కాం పెను కలకలం రేపుతోంది. అడ్వొకేట్ రిజ్వాన్ సిద్ధిఖీని ముంబయిలోని థానే క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సీడీఆర్ స్కాం బట్టబయలైంది. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ తన భార్యపై అనుమానంతో రిజ్వాన్ సిద్ధిఖీని కలిసి ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి, ఆమె కాల్ డేటా రికార్డులు సంపాదించాడన్న ఆరోపణలు రావడంతో ఈ స్కాం డొంక కదిలింది. దీనిపై విచారణ చేసిన పోలీసులు రిజ్వాన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, విచారణలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ భార్య ఆయేషా, నటి కంగనా రనౌత్ లు కూడా కాల్ డేటా రికార్డులు కోరినట్టు వెల్లడైంది.
దీంతో వారిద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హృతిక్ రోషన్ తో విభేదాల నేపథ్యంలో కంగన ఆయన ఫోన్ నెంబర్ రిజ్వాన్ కి ఇచ్చి కాల్ డేటా అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై విమర్శలు రావడంతో కంగన సోదరి రంగోలి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, సరైన విచారణ జరపకుండా ఆరోపణలు చేయడం తగదని సూచించారు. హృతిక్ విషయంలో కంగనకు నోటీసులు వచ్చినప్పుడు ఆధారాల కోసం వివరాలు ఇచ్చామని దానిని పట్టుకుని ఒక నటి పరువుతీయడం సబబు కాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.