Mission kakatiya: ‘మిషన్ కాకతీయ’కు కేంద్రం సహకరించట్లేదు : మంత్రి హరీశ్ రావు

  • నీతి ఆయోగ్ సిఫారసును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
  • ఈ విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు
  • శాసనమండలిలో హరీశ్ రావు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మిషన్ కాకతీయ’కు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శాసనమండలిలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కానీ కేంద్రం స్పందించలేదని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తో పాటు తాను కూడా పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదని అన్నారు.

మిషన్ కాకతీయ వల్ల చెరువుల పునరుద్ధరణ కారణంగా కృష్ణా బేసిన్ లో 89 టీఎంసీలు, గోదావరి బేసిన్ లో 165 టీఎంసీల సామర్థ్యం పెరిగినట్టు హరీశ్ రావు చెప్పారు. ‘మిషన్ కాకతీయ’ అమలు తీరును శాస్త్రీయంగా అధ్యయనం చేసిన నాబార్డుకు చెందిన 'నాబ్ కాన్'
నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు హరీశ్ రావు చెప్పారు.

మిషన్ కాకతీయ మొదటి దశలో ఎంపిక చేసిన చెరువులున్న గ్రామాల్లో చెరువుల కింద ఆయకట్టు రైతాంగ కుటుంబాల్లో సర్వే, వారితో చర్చలు, ఉపగ్రహ చిత్రాల పరిశీలన , విశ్లేషణ , కొన్ని చెరువులపై  కేస్ స్టడీ ఇతరత్రా లభ్యమయ్యే సమాచారం ఆధారంగా మిషన్ కాకతీయ ప్రభావాలను ఆ సంస్థ అధ్యయనం  చేసినట్లు తెలిపారు. 400 చెరువు గ్రామాల్లో 12 వేల కుటుంబాలను నాబ్ కాన్ సర్వే కోసం ఎంపిక చేసిందని, 2016 ఖరీఫ్ లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోయినా మిషన్ కాకతీయ అమలు కారణంగా 51.5% సాగు విస్తీర్ణం పెరిగిందని హరీశ్ రావు తెలిపారు. ఈ పెరుగుదల రబీ పంట కాలంలో ఎక్కువగా నమోదైందని, రాష్ట్రంలో చెరువుల కింద 10.53 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని, ‘మిషన్ కాకతీయ’ అమలు తర్వాత చెరువుల్లో నీటి నిల్వ పెరిగిన కారణంగా నీటి లభ్యత పెరిగిందని, వరి పంట సాగు 49.2% నుంచి 62.1% కు పెరిగిందని తెలిపారు.

2016-17 రబీ సీజన్ లో ఖరీఫ్ లో సాగు అయిన వరి పంట విస్తీర్ణం కంటే 7.2 %, వరి పంట దిగుబడి 4.1 % , పత్తి పంట దిగుబడి  6.5%  పెరిగినట్టు వివరించారు. కందుల దిగుబడి ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మక్క దిగుబడి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు, భూగర్భ జల సంపద 9 మీటర్ల కు పెరిగినట్టు హరీశ్ రావు తెలిపారు. సర్వే కోసం 'నాబ్ కాన్' ఎంపిక చేసిన మిషన్ కాకతీయ చెరువుల్లో 70 % చెరువుల్లో 3 నుంచి 6 నెలలు మాత్రమే నీటి నిల్వ ఉంటుందన్నారు. 20% చెరువుల్లో 6 నుంచి 9 నెలలు నీటి నిల్వ ఉంటుందన్నారు. మొత్తంగా 2016-17 సంవత్సరంలో చేపల ఉత్పత్తి  36-39 % పెరిగినట్లు మంత్రి చెప్పారు. చెరువు ఆయకట్టు పరిధిలో ఉన్న ప్రాంతంలో కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 % పెరిగిందని, చెరువు ఆయకట్టులో సాగు విస్తీర్ణం పెరిగిందని, ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలను మార్కెట్లో కల్పించడంతో వ్యవసాయ ఆదాయం 47.4 % పెరిగిందని తెలిపారు. మిషన్ కాకతీయ అమలుకు ముందు  63 % చెరువులు బాగా లేవని , 3 % చెరువులు దారుణంగా ఉన్నాయని అన్నారు.

మిషన్ కాకతీయ విజయవంతంగా అమలు అయిన తర్వాత చెరువుల నిర్వహణ కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని హరీశ్ రావు చెప్పారు. ‘మిషన్ కాకతీయ’ ఫలితాలపై ప్రభుత్వానికి ఉన్న అంచనా ఈ అధ్యయనం ద్వారా నిజమని తేలిపోయిందన్నారు. మిషన్ కాకతీయలో చెరువు కట్టలు బలోపేతం అయిన కారణంగా వరదలకు తెగిపోయిన చెరువులు, ఇతరత్రా నష్టపోయిన చెరువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని హరీశ్ రావు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో పునరుద్ధరణకు నోచుకున్న చెరువుల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరినందున 2016-17 రబీ పంట కాలానికి చెరువుల కింద సాగునీరు పుష్కలంగా అందిందని, రెండేండ్ల వరుస కరవుల అనంతరం చెరువుల్లోకి నీరు చేరిందని అన్నా రు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News