america: అమెరికా కొత్త చట్టంతో భారతీయ ఉద్యోగులకు ఎసరు!
- కాల్ సెంటర్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ చేస్తున్న సంస్థల జాబితా తయారీ
- ఔట్ సోర్సింగ్ చేయని కంపెనీలకే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రాధాన్యత
- అమెరికా ప్రతినిధుల సభలో ప్రతిపాదిత చట్టం
- ఆమోదం పొంది, అమల్లోకి వస్తే లక్షలాది కాల్ సెంటర్ ఉద్యోగాలకు ప్రమాదం
అమెరికా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త చట్టం లక్షలాది మంది భారతీయుల ఉద్యోగాలను ప్రశ్నార్థకం చేయనుంది. కాల్ సెంటర్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ కింద విదేశాలకు తరలిస్తున్న అమెరికన్ కంపెనీల జాబితా తయారు చేయాలని.. ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ చేయని కంపెనీలకు అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆ దేశ ప్రతినిధుల సభలో చట్టాన్ని ప్రతిపాదించారు. అంతేకాదు కాల్ సెంటర్ కంపెనీలు తాము సేవలు అందిస్తున్న ప్రదేశాన్ని వినియోగదారులకు తెలియజేయాలని.. అమెరికా బయట ఇతర దేశాల నుంచి అందిస్తున్న సేవలను స్వదేశంలోని సర్వీస్ ఏజెంట్ కు బదిలీ చేయాల్సిందిగా కోరే హక్కును కల్పించాలని అందులో స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదిత చట్టం ఆమోదం పొంది అమల్లోకి వస్తే.. అమెరికా నుంచి ఔట్ సోర్సింగ్ చేసే కాల్ సెంటర్ ఉద్యోగాలపై భారీగా ప్రభావం పడుతుంది.
అమెరికాలోని ఓహియో సెనేటర్ షెరాడ్ బ్రౌన్ ఈ కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. అమెరికాలో పన్నుల నుంచి తప్పించుకునేందుకు చాలా కంపెనీలు కాల్ సెంటర్ ఉద్యోగాలను భారత్, మెక్సికో వంటి విదేశాలకు ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయని ఆయన ప్రతినిధుల సభలో పేర్కొన్నారు. ఏ కంపెనీ అయినా వారి కస్టమర్ సర్వీస్ సిబ్బంది తోడ్పాటు లేకుండా తగిన విధంగా పనిచేయలేదని.. అలా కంపెనీల అభివృద్ధికి తోడ్పడిన అమెరికన్ల ఉద్యోగాలు విదేశాలకు తరలి వెళ్లకుండా చూడాలని వ్యాఖ్యానించారు.