TRS: అవిశ్వాసానికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు: టీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం
- నాలుగేళ్లు కాపురం చేసిన పార్టీపై అవిశ్వాసమా?
- ఇప్పుడు ఎవరు మద్దతిస్తారు?
- మా అధినేతను అడిగే పెట్టారా?
- టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ, వైఎస్ఆర్ సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానాలకు మద్దతిచ్చే విషయంలో టీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తాము అవిశ్వాసానికి అనుకూలం కాదని, వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత నాలుగేళ్లుగా కాపురం చేసిన పార్టీపై ఇప్పుడు అవిశ్వాసం పెడితే తామెందుకు సహకరించాలని ప్రశ్నించారు.
తమ పార్టీ అధినేతతో సంప్రదింపులు జరిపి వారేమైనా అవిశ్వాసాన్ని పెట్టారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు మాత్రమే తాము సభలో రిజర్వేషన్ల కోటా పెంపునకు డిమాండ్ చేస్తున్నామే తప్ప, ఎవరి కోసమో వెల్ లోకి వెళ్లడం లేదని అన్నారు. ఈ నిరసన అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత మొదలైనది కాదని, రెండు వారాలుగా తాము నిరసనలు తెలుపుతూనే ఉన్నామని గుర్తు చేశారు. తమకు కేంద్రం నుంచి సరైన హామీ లభించేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రారంభించనున్న థర్డ్ ఫ్రంట్ లో చంద్రబాబు కలుస్తారా? లేదా? అన్నది ఇప్పటికిప్పుడు సమాధానం లభించే ప్రశ్న కాదని నర్సయ్య గౌడ్ వెల్లడించారు.