ram rajya rath yatra: ఆ యాత్రను రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకోండి.. శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుంది: స్టాలిన్
- రామ్ రాజ్య రథ్ యాత్రను చేపట్టిన వీహెచ్పీ
- ఫిబ్రవరి 13న అయోధ్య నుంచి యాత్ర ప్రారంభం
- నేడు తమిళనాడులో ప్రవేశించనున్న యాత్ర
విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న 'రామ్ రాజ్య రథ్ యాత్ర'ను తమిళనాడులో ప్రవేశించకుండా అడ్డుకోవాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ యాత్ర వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మతసామరస్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 13న అయోధ్య నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ రోజు కేరళలోని పునలూరు నుంచి తిరునల్వేలిలోకి రథ యాత్ర అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో, యాత్రకు వ్యతిరేకంగా నిరసన చేపడతామంటూ కొందరు ప్రకటించడంతో... తిరునల్వేలిలో 144 సెక్షన్ విధించారు. ఈ సందర్భంగా, అన్నాడీఎంకే ప్రభుత్వంపై స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నందునే ఈ యాత్రకు అన్నాడీఎంకే అడ్డు చెప్పడం లేదని అన్నారు.