Chandrababu: పవన్ విమర్శలు తీవ్రమైనవి... సీరియస్ గా తీసుకుంటున్నా: ఎంపీలతో చంద్రబాబు
- పవన్ నుంచి ఇలాంటి విమర్శలు ఊహించలేదు
- ఎవరికి మేలు చేసేందుకు ఈ తరహా విమర్శలు
- ఎన్నడో చేసిన విమర్శలు మోదీకి ఇంకా గుర్తుంటాయా?
- ఎంపీలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్
తనకు, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య విభేదాలు ఉన్నాయని, అందువల్లే తనకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పవన్ విమర్శలు తీవ్రమైనవని అభిప్రాయపడుతున్నారు.
నిత్యమూ రాజకీయాలు చేసే జగన్, ఇటువంటి విమర్శలు చేస్తే పట్టించుకోబోనని, కానీ తాను మిత్రుడిగా భావించిన పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. తనకు, ప్రధానికి మధ్య విభేదాలపై పవన్ ఆధారాలు చూపాలని అన్నారు. లోకేష్ అవినీతిపై మోదీ వద్ద ఆధారాలు ఉన్నాయని పవన్ చెప్పడాన్ని కూడా చంద్రబాబు ఎంపీలతో ప్రస్తావించారు. అసత్య ఆరోపణలు చేసి ఎవరికి మేలు చేయాలని పవన్ భావిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
ఎప్పుడో ఏళ్ల క్రితం గోద్రా ఘటనలు జరిగినప్పుడు అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని తాను విమర్శించానని, అది అప్పటికే పరిమితమని, ఆ లాజిక్ ఇప్పుడు పని చేయదని చెప్పారు. ప్రధానిగా ఉన్న మోదీ, నాటి తన వ్యాఖ్యలను గుర్తుంచుకుంటారని కూడా భావించడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని నేతలకు సూచించారు.