CRPF: తిరిగి డ్యూటీలో చేరిన 'ఇండియన్ బ్రేవ్ హార్ట్' చేతన్ చీతా!
- గత సంవత్సరం ఉగ్రవాదులతో పోరాడిన చేతన్
- 9 బులెట్లు తగిలి మృత్యువు అంచులకు
- కోలుకుని తిరిగి విధుల్లో చేరిన చేతన్
ఇండియన్ బ్రేవ్ హార్ట్ గా పేరు తెచ్చుకుని రెండో అత్యున్నత సైనిక పురస్కారం కీర్తి చక్రను అందుకున్న సీఆర్పీఎఫ్ జవాను చేతన్ కుమార్ చీతా తిరిగి డ్యూటీలో చేరారు. న్యూఢిల్లీలోని సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ లో కమాండెంట్ గా ఆయన చేరేందుకు వచ్చిన వేళ, సహచరులంతా స్వాగతం పలికారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఉత్తర కాశ్మీర్ పరిధిలోని బందిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి జరిపినప్పుడు వారికి ఎదురొడ్డి పోరాడిన చేతన్, బులెట్ గాయాలతో తీవ్రంగా గాయపడి, మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు.
ఉగ్రవాదులతో పోరులో చేతన్ కూడా మరణించారనే అందరూ భావించగా, అద్భుత రీతిలో కొనప్రాణంతో ఆసుపత్రిలో చేరి, మృత్యువుతో పోరాడి తిరిగి డ్యూటీ చేసేంత స్థాయికి కోలుకున్నాడు. 45వ బెటాలియన్ లో కమాండెంట్ గా ఉన్న చేతన్ శరీరంలో ఉగ్రవాదులు కాల్చిన 9 బుల్లెట్లను వైద్యులు బయటకు తీస్తున్న వేళ కూడా అతను తిరిగి కోలుకుంటాడని చెప్పలేని పరిస్థితి వుండేది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్ లో చికిత్స పొందిన చేతన్, తిరిగి కోలుకోవడం ఎంతో సంతోషకరమని సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు.