UBER: తొలి యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ లెస్ కారు... మహిళ మృతి!
- అమెరికాలో ఘటన
- డ్రైవర్ లెస్ కారు ప్రమాదంలో తొలి మరణం
- సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను సస్పెండ్ చేస్తున్నాం
- ప్రకటించిన ఉబెర్
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా విస్తరించే దిశగా అడుగులు వేస్తుండగా, ఈ కార్లతో ఇబ్బందులూ ఉంటాయని తొలిసారి నిరూపితమైంది. అమెరికాలోని అరిజోనా పరిధిలోని టెంపీ ప్రాంతంలో ఉబెర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు యాక్సిడెంట్ చేయగా, ఓ మహిళ చనిపోయింది. ప్రపంచంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ యాక్సిడెంట్ లో ప్రాణాలు పోవడం ఇదే తొలిసారి.
ఈ ఘటనతో అమెరికా, కెనడాల్లో తమ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను సస్పెండ్ చేస్తున్నట్టు ఉబెర్ పేర్కొంది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారు స్వీయ డ్రైవింగ్ నిబంధనల్లో ఉందని, వెహికిల్ ఆపరేటర్ కూడా స్టీరింగ్ ముందు కూర్చునే ఉన్నాడని టెంపీ పోలీసులు వెల్లడించారు. ఓ క్రాస్ వాక్ వద్ద మహిళ నడుస్తూ వెళుతుండగా, ఈ కారు ఢీకొందని, తీవ్ర గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం తరలించగా, ఆసుపత్రిలో కన్నుమూశారని తెలిపారు. ఈ ఘటనతో డ్రైవర్ లెస్ కార్లపై చేస్తున్న పరీక్షలను నిలిపివేస్తున్నట్టు ఉబెర్ పేర్కొంది. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని, విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని ఉబెర్ టెక్నాలజీస్ ప్రతినిధి ఒకరు ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.