AAP: క్షమాపణలు చెబుతున్నారు సరే... తరువాత మీ పరిస్థితేంటి?: కేజ్రీవాల్ కు ఒమర్ అబ్దుల్లా సూటి ప్రశ్న
- కపిల్ సిబాల్, నితిన్ గడ్కరీకి క్షమాపణలు చెప్పిన కేజ్రీవాల్
- అరుణ్ జైట్లీకి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం
- ఇలా క్షమాపణలు చెప్పుకుంటూ వెళ్తే.. భవిష్యత్ లో ప్రజలు మీ ఆరోపణలు నమ్ముతారా?
ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నారు సరే... తరువాత మీ పరిస్థితి ఏంటి? అని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సూటిగా ప్రశ్నించారు. గతంలో తాను చేసిన అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్ వరుసగా క్షమాపణలు చెబుతుండడంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన... క్షమాపణ చెప్పడం వల్ల న్యాయపరమైన చిక్కులు తీరుతాయి. కానీ, రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇకపై ఎప్పుడైనా ఆయన ఎవరిపైనైనా విమర్శలు చేసినప్పుడు ప్రజలు వాటిని పట్టించుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కపిల్ సిబాల్, నితిన్ గడ్కరీలకు క్షమాపణలు చెప్పిన ఆయన, అరుణ్ జైట్లీకి కూడా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.